ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్లనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేకపోయామని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్మీ అన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ఇవాళ బీజేపీ ధర్నాకు దిగింది. వారు మేయర్ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్, పెట్టాలని ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై మేయర్ విజయ లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించామని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సమావేశం నిర్వహించలేకపోయామని అన్నారు.
కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోయినా నా వద్దకు నేరుగా వచ్చి ఏదైనా అడగొచ్చు అన్నారు. కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేయడం సరికాదని ఆమె అన్నారు. జీహెచ్‌ఎంసీలో సొమ్ము మేయర్ సొమ్ము కాదని, అది ప్రజల సొమ్ము అని ఆమె అన్నారు. అధిష్టానం సూచన మేరకే బీజేపీ కార్పొరేటర్లు విధ్వంసానికి దిగారా? ఎవరి ఆదే శాల మేరకు వారు ధర్నాకు సిద్ధమయ్యారో తెలియదన్నారు. జీహెచ్ ఎంసీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీహెచ్‌ఎంసీకీ 13 అవార్డులు వచ్చాయి. కార్పొరేటర్లకు క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు నాకు తెలుసు. పార్టీలకు అతీతంగా వచ్చి అడిగితే పనులు చేస్తున్నాం అని మేయర్ విజయలక్మీ తెలిపారు.
