Cyber Fraud: మ్యాట్రిమోనీ సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు. సైబర్ మోసాలు చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి ఏకంగా లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైంది. ఏకంగా అతని వద్ద 22 లక్షలు దోచేశారు. చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
ఇన్నాళ్లూ లింకులు.. ఓటీపీలు అని చెబుతున్న సైబర్ కేటుగాళ్లు… కొంత పంథా షురూ చేశారు.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకోవడం మొదలు పెట్టారు. తాజాగా మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా మోసం చేయడం షురూ చేశారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ బహుదూర్‌పురాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఓ మ్యాట్రీమోనీ సైట్‌లో వధువు కావాలంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి వెంటనే ఓ యువతి రిప్లై ఇచ్చింది. అతడు అడగక ముందే తనను పాకిస్తాన్‌కు చెందిన నటిగా పరిచయం చేసుకుంది. తన పేరు పర్వరిష్ షా అని చెప్పింది. పాకిస్తాన్‌లో ఫేమస్ నటి అంటూ కలర్ ఇచ్చింది. అంతే కాదు తన వాట్సాప్ నంబర్‌ను కూడా వ్యాపారవేత్తతో పంచుకున్న ఆ కిలాడీ లేడీ.. డీపీని కూడా పాకిస్తాన్ నటి పర్వరిష్ షా ఫోటోనే పెట్టుకుంది.. ఈ విషయాలేవీ తెలియని అమాయక చక్రవర్తి.. తాను ఏకంగా పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహల్లో తేలియాడాడు. అంతే కాదు… తన ఫ్రెండ్స్, చుట్టాలు అందరితోనూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఆనందంతో ఎగిరి గంతేశాడు. కానీ ఆ ఆనందం కొద్ది రోజులకే పరిమితమైంది..
తాను నటించిన సీరియల్స్, సినిమాల వీడియోలు, ఫోటోలు అంటూ ఆ లేడీ కిలాడీ.. మనోడికి కొన్ని వీడియోలు షేర్ చేసింది. నిజానికి ఆ లేడీ కిలాడీ అసలు పేరు ఫాతిమా. ఐతే ఫాతిమా సోదరినంటూ అనీసా ఎం. హుండేకర్ అని మరో మహిళ కూడా పరిచయం చేసుకుంది. ఇద్దరూ కలిసి ఆ వ్యాపారవేత్తను మాయ మాటలతో బురిడీ కొట్టించారు. తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు అంటూ దశల వారీగా అతని దగ్గర నుంచి 22 లక్షలు వసూలు చేశారు…. చివరకు ఓ రోజు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతడికి అనుమానం వచ్చింది. పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయట పడింది. ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..
Microsoft Layoffs: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. ఏకంగా 9 వేల మందికి లేఆఫ్ నోటీసులు
