CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!

  • గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో కాంస్య విగ్రహం
  • రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ
  • ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి పునాది
  • తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రపై ప్రశంసలు
Manohansingh

Manohansingh

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందించిన చారిత్రాత్మక సేవలను స్మరించుకున్నారు. విప్రో సర్కిల్‌లో నెలకొల్పిన ఈ విగ్రహం కేవలం ఒక స్మారకం మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర, ఆర్థిక దూరదృష్టి , నిరాడంబర నాయకత్వాన్ని భావితరాలకు గుర్తుచేసే నిత్య స్ఫూర్తి అని కొనియాడారు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు.. దేశ ప్రగతికి బలమైన పునాది

భారతదేశాన్ని ఆర్థిక ప్రగతి పథంలో నడిపించిన మహోన్నత ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 1991లో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ రూపరేఖలను పూర్తిగా మార్చివేశాయని గుర్తుచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పదేళ్ల పాటు దేశ ఆర్థిక స్థిరత్వం, జాతీయ అభివృద్ధి , ప్రజా సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు అతులితమైనవన్నారు. తన హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), సమాచార హక్కు చట్టం (RTI), ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం (RTE) వంటి చారిత్రాత్మక నిర్ణయాలను అమలు చేసి సామాన్యులకు హక్కులు, అవకాశాలను విస్తరించారని ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర చారిత్రాత్మకం

తెలంగాణ ప్రజల దశాబ్దాల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర అత్యంత కీలకమైనదని మంత్రి స్పష్టం చేశారు. 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం నుంచి, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు సాగిన పరిణామాల్లో ఆయన నాయకత్వం చారిత్రాత్మకమని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావంలో నాటి యూపీఏ ప్రభుత్వం , మన్మోహన్ సింగ్ వహించిన పాత్రను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ మార్గదర్శకత్వంలో పనిచేయడం తన ప్రజా జీవితంలో గొప్ప గర్వకారణమని, ఆయన సహకారంతోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగానని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.