NTV Telugu Site icon

Congress: భట్టికి ఠాగూర్‌ ఫోన్.. సోనియా, రాహుల్‌ అభినందనలు..

సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్.. ఈ సందర్భంగా … సోనియా, రాహుల్ అభినందించారని వెల్లడించారు.. భట్టి చేస్తున్న పాదయాత్రకు ఏఐసీసీ సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడించారు..

Read Also: Vijayashanti: సంస్కృతి కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారు..

ప్రజా సమస్యల పరిష్కారంకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. హర్షం వ్యక్తం చేశారని ఠాగూర్ తెలిపారు.. భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పాదయాత్ర మధిర నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భట్టి విక్రమార్క చేసే పాదయాత్రకు అధిష్టానం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వారు తెలిపారని ఫోన్ లో చెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం రేపల్లెవాడలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సమయంలో ఠాగూర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే క్రమంలో ఫోన్ ద్వారా గ్రామ ప్రజలకు మాణిక్యం ఠాగూర్, రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని వివరించారు. మోడీ సర్కార్ డీజిల్ పెట్రోల్ గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర గురించి అధినేత రాహుల్ గాంధీ తెలుసుకొని అభినందించారని వెల్లడించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణలో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదన్నారు.. రానున్న రోజుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం ఉధృతం చేయాలన్నారు. భట్టి విక్రమార్క మాకు అత్యంత మిత్రుడని తన అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.
భట్టితో కలిసి నడుస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఠాగూర్.