మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురు సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురిని సజీవ దహనం చేసిన నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల డీసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి కేసు నిందితుల వివరాలను వెల్లడించారు. గుడిపల్లి గ్రామంలో ఇంటిని తగలబెట్టగా అందులో మాసు శివయ్య, శనిగారపు శాంతయ్య, రాజ్యలక్ష్మి, నెమలికొండ మౌనిక, నెమలికొండ ప్రశాంతి, నెమలికొండ హిమబిందు సజీవ దహనం అయ్యారు అని తెలిపారు.
Read Also: Off The Record: చోడవరంపైనే ఫోకస్.. పీఠం కదిలేనా?
సజీవ దహనం కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితులను స్వల్ప దినాలలోనే గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. హత్యకు కుట్ర పన్నింది మృతుడు శాంతయ్య భార్య సృజనగా పోలీసులు గుర్తించినట్లు ఆయన వివరించారు. సింగరేణి ఉద్యోగం తన కుమారుడికి ఇవ్వనని చెప్పడం సింగరేణి ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే డబ్బులు ఇవ్వనంటూ రాజ్యలక్షి కి ఇస్తానంటూ చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సృజన భర్త హత్యకు పథకం రచించిందని తెలిపారు. లక్షెట్టిపేటకు చెందిన డాక్యుమెంటరీ రైటైర్ లక్ష్మణ్ తో ఉన్న పరిచయం కారణంగా ఆయనకు శాంతయ్యను హత్య చేయాలని చెప్పడం అందుకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో సమ్మతించాడని అని ఆయన తెలిపారు.
లక్ష్మణ్ లక్షేటిపేటకు చెందిన రమేష్, గుడిపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య, గోదావరిఖని చెందిన ఆమకొండ అంజయ్యలతో కలిసి హత్యకు అనేక సార్లు కుట్ర పన్నాడని ఆయన వివరించారు. వాహనంతో ఢీ కొట్టి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని తొలుత భావించగా సాధ్యం కాకపోవడంతో ఇంటిని దహనం చేయాలని నిర్ణయించినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు చెప్పారు. సీసీసీ లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి ఆటోలో గుడిపల్లికి వెళ్లి ఇంటి పై పెట్రోల్ చల్లి ఆరుగురు సజీవ దహనం కు కారణమయ్యారని తెలిపారు.
Read Also:Off The Record: వలస నేతల్లో ముదురుతున్న రచ్చ
అనంతరం మంచిర్యాల వచ్చిన లక్ష్మణ్ లాడ్జిలో ఉండి అక్కడి లక్షెట్టిపేటకు వెళ్లినట్లు తెలిపారు. అయితే ఇంట్లో ముగ్గురు ఉన్నారని భావించగా అదనంగా మరో ముగ్గురు ఉన్నట్లు మొత్తం ఆరుగురు దహనమైనట్లు నిందితులు గమనించారని తెలిపారు. మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద నిందితులు లక్ష్మణ్, రమేష్, సమ్మయ్యలను అరెస్టు చేయగా శ్రీరాంపూర్ లో సృజన, అంజయ్యలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు నిందితులపై హత్యా, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈసమావేశంలో డీసీపీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు….