Malkajgiri Police Arrests 4 Members In Fingerprint Surgery Case: ఇల్లీగల్ ఫింటర్‌ప్రింట్ సర్జరీ కేసులో మరో నలుగురు నిందితుల్ని మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లో కమలేశ్, విశాల్ కుమార్‌ని.. కేరళలో అబ్దుల్ ఖదీర్, మహమ్మద్ రఫీలను అదుపులో తీసుకున్నారు. అయితే.. ఈ ముఠాకి చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇదే కేసులో ఆగస్టు 29న కువైట్‌కి వెళ్లిన మరో నలుగురిని సైతం అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. రాజస్థాన్, కేరళలో ఈ ఫేక్ ఫింగర్‌ప్రింట్ ముఠా ఆపరేషన్ నిర్వహిస్తోందని.. నిందితులు ఎక్కడుతున్నారో పక్కా సమాచారం తెలుసుకొని రాజస్థాన్‌లో ఇద్దరిని, కేరళలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. మరో ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఫింగర్‌ప్రింట్ మారదని, కానీ ఈ ముఠా మాత్రం ఆపరేషన్‌తో ఫింగర్‌ప్రింట్‌ని మార్చేస్తున్నారని అన్నారు. సరిగ్గా ఫింగర్ దగ్గర కట్ చేసి, అంతకుముందున్న ఫింగర్‌ప్రింట్ మ్యాచ్ కాకుండా చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని, నిందితుల నుంచి 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు.
అలాగే.. ఫేక్ కాల్ సెంటర్‌తో మోసాలకు పాల్పడుతున్న ఒక సైబర్ గ్యాంగ్‌ని సైతం అదుపులోకి తీసుకున్నట్టు మహేశ్ భగవత్ చెప్పారు. బీహార్, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా.. అలాగే కోల్‌కత్తా కేంద్రంగా ఒక ముఠా ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తోందని అన్నారు. తమకు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగి.. ప్రధాన నిందితుడు ఉత్తమ్ కుమార్‌తో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. ముడవత్ రమేష్‌తో కలిసి ఉత్తమ్ కుమార్ 2017 నుంచి తెలుగు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడని, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో వస్తువులు కొనుగోలు చేస్తున్న వారినే ఈ ముఠా టార్గెట్ చేసి మోసాలకు పాల్పడినట్టు వివరించారు. ‘లక్కీ డ్రా’ వచ్చిందంటూ ఈ ముఠా చార్జీల పేరిట డబ్బులు వసూలు చేసి మోసాలు చేసిందన్నారు.
ఇబ్రహీంపట్నంకు చెందిన కిషోర్ ఇటీవల నాప్తోల్‌లో షాపింగ్ చేయగా.. స్క్రాచ్ కార్డ్‌లో కార్ వచ్చిందంటూ అతడ్ని మోసం చేశారని తెలిపారు. ఇలా నిందితులపై దేశవ్యాప్తంగా 116 కేసులు, ఒక్క తెలంగాణలోనే 34 కేసులున్నాయన్నారు. నిందితుల నుంచి లక్ష 62 వేల నగదు, ఒక కారు, బ్యాంక్ సీజ్ చేసిన 2 లక్షల 88వేలు అమౌంట్, 39 మొబైల్ ఫోన్స్, 5లాప్ టాప్స్, వైఫై రూటర్లు 2, 16 డెబిట్ కార్డ్స్, 121 నాప్తోల్ లెటర్ స్కాచ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. డేటా ప్రొవైడర్లు కస్టమర్ల డేటాను అమ్ముతున్నాయని, వారిని కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పారు.