TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?

  • విభజన హామీలు, కేంద్ర నిధులపై అమిత్ షాను నిలదీసిన పీసీసీ చీఫ్
  • కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమయ్యాయని ప్రశ్న
  • బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ సంబంధాలున్నాయని విమర్శలు
  • తెలంగాణకు చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్
Mahesh Goud

Mahesh Goud

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో నిర్వహించిన సభలు, పాదయాత్రల వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించి, ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజలు చౌకబారు ప్రసంగాలు వినడానికి సిద్ధంగా లేరని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు, రైతుల సంక్షేమంపై కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ విభజన హామీలు ఏమయ్యాయి?.. పీసీసీ చీఫ్

అమిత్ షా సభ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు మహేష్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలోని హామీలను ఏమేరకు అమలు చేశారని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో ఎన్ని విడుదల చేశారని నిలదీశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్ల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంపై రాజకీయ వివక్ష చూపుతూ నిధులు నిలిపివేసినప్పటికీ, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ల లాలూచీ రాజకీయాలు.. ఓటర్ల జాబితాపై విమర్శలు

రాష్ట్రంలో ‘ఆర్ఆర్ ట్యాక్స్’ అంటూ బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు తల తోక లేనివని మహేష్ కుమార్ గౌడ్ కొట్టేశారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇప్పుడున్న ఎనిమిది సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పుల భారంలో కూరుకుపోయిందని, కుటుంబ పాలన కొనసాగిందని దుయ్యబట్టారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ బలహీనపడటంతో ఆ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ సంబంధాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటు చోరీపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న అనుమానాలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మతం పేరుతో, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తేనే తెలంగాణ గుర్తుకు వస్తుందని, రాష్ట్ర సమస్యలను మాత్రం పట్టించుకోరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తుంటే, బీజేపీ మాత్రం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఓటు హక్కును కాపాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.