NTV Telugu Site icon

Mahabubabad Rain: కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.. 10 గంటలుగా బస్సులోనే ప్రయాణికులు

Mahanoonanad

Mahanoonanad

Mahabubabad Rain: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు, రైలు పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా జలమయమైంది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి-ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్‌ కింద కంకర నుజ్జునుజ్జయింది. మట్టి కోత కారణంగా ట్రాక్‌ కింది నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై నుంచి వరద ప్రవహించడంతో మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పాండుపల్లి వద్ద 4 గంటలపాటు నిలిపివేశారు. మచిలీపట్నం, సింహపురి రైళ్లు మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయాయి.

Read also: Heavy Rains: రాష్ట్రంలో కురుస్తున్న వానలు.. తెలంగాణలో జిల్లాల పరిస్థితి ఇదీ..

మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వరి పంట మొత్తం నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు ఎగిరిపోయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో రావిరాల గ్రామం పూర్తిగా నీట మునిగింది. సాయం కోసం ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. తమ బంధువులకు ఫోన్ చేసి కాపాడుతున్నారు. సాగర్ అనే వ్యక్తి కుటుంబంతో పాటు మరో మూడు కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాయని, ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఇక రాజుల కొత్తపల్లి ఆనకట్ట తెగిపోవడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో అన్న స్వామి కుంట కట్ట తెగిపోయి రోడ్డు కోతకు గురైంది. గూడూరు శివారులో పాకాల వాగు పొంగిపొర్లుతోంది. దీంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండ, గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Read also: Telangana Rains: తెలంగాణకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు..

ఇక మరోవైపు వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం రాత్రి బయల్దేరిన RTC బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని ప్రయాణికులు కోరారు.
Traffic Challan: నిబంధనలను అతిక్రమిస్తే.. నేరుగా మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌..