NTV Telugu Site icon

Pillalamarri: మళ్ళీ జీవం పోసుకున్న పిల్లలమర్రి.. టచ్ చేస్తే భారీ జరిమానా..!

Pillalamarri Mahaboobnagar Treee

Pillalamarri Mahaboobnagar Treee

Pillalamarri: మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులోని ప్రసిద్ధ చెందిన మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహావృక్షం 2018లో నేలకొరిగి చెదలు పట్టి, కొత్త ఊడలు రాక నిర్జీవంగా మారింది. అప్పటి నుంచి దాన్ని కాపాడేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత పిల్లలమర్రి కొత్త పుంతలు తొక్కుతూ సందర్శకులకు రా.. రామ్మంటూ పిలుస్తోంది. దీంతో 2018 నుంచి పిల్లలమర్రి సందర్శనపై విధించిన నిషేధాన్ని వచ్చే వారం నుంచి ఎత్తివేసి సందర్శకులను అనుమతిస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని చెట్టును ఎవరైనా ముట్టుకుంటే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఇందుకోసం గార్డులను కూడా నియమించామని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాన్ని సుమారు రూ.50 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు పార్కు, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, ఆర్వీ ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించారు.

Read also: NTV Effect: జేఎన్టీయూ ఘటనపై దామోదర సీరియస్‌. క్యాంపస్‌ కు అడిషనల్ కలెక్టర్ మాధురి..

పిల్లలమర్రిలో భాగమైన మహావృక్షం నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని రెమ్మలు నేలను తాకినట్లయితే, అవి కూడా చెట్లుగా పెరుగుతాయి. అయితే గతంలో ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో కొందరు మహావృక్షం కొమ్మలను ఎక్కి వాటిమీద పేర్లు చెక్కడం, చిన్నచిన్న ఊడలను తుంచడం చేస్తూ వచ్చారు. దీంతో.. మహావృక్షానికి చీడ ఆవహించింది. దీని ఫలితంగా కొమ్మలు, ఊడలు ఊడిపోతూ.. చెదలు కూడా తోడవడంతో చెట్టు ఎండిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. ఈనేపథ్యంలో 2018 సెప్టెంబర్ నుంచి పిల్లలమర్రిని సందర్శించేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ మహావృక్షాన్ని సంరక్షించే బాధ్యతను పర్యాటక శాఖ నుంచి మహబూబ్ నగర్ అటవీశాఖకు అప్పగించారు. అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ఫండ్స్‌కు మహావృక్ష సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. తొలుత చెదపురుగుల నివారణపై అటవీ సిబ్బంది దృష్టి సారించారు. మహావృక్షానికి సెలైన్ బాటిళ్ల ద్వారా క్రిమిసంహారక మందులను ఎక్కించారు. కొన్ని నెలల పాటు ఈ చికిత్స అందించిన తర్వాత, ప్రభావితమైన కొమ్మలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత మహావృక్షం నుంచి చిన్నపాటి ఊడలు రావడంతో, ఆ ఊడలు బలంగా దిగేందుకు రెండు అడుగులు, పది అంగుళాల పైపులు ఏర్పాటు చేశారు. ఆ పైపు ద్వారా నీరు భూమిలోకి వెళ్లేలా చేశారు. పొదుగులకు సూర్యరశ్మి వచ్చేలా పైపులకు రంధ్రాలు కూడా చేశారు.

Read also: Thummala Nageswara Rao: సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ కోసం చైనా నుంచి ఇంజనీర్ లు..

సుమారు మూడున్నరేళ్లుగా మొక్కలకు ఎరువులు, మందులు వేయడంతో అవి బలంగా పెరిగాయి. పైపులను పగులగొట్టి భూమిలోకి చొచ్చుకుపోయి మహావృక్షాన్ని ఆదుకున్నారు. అలాగే ఈదురు గాలులు, భారీ వర్షాలకు పిల్లలమర్రి చెట్టు దెబ్బతినకుండా మధ్యలో ఉన్న పెద్ద పెద్ద కొమ్మలకు సపోర్టుగా రెండున్నర అడుగుల వెడల్పు, 6 అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తులో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. చెట్టు బలంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఎరువులు వేశారు. అధికారులు కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పాలమూరును టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లమలలో పర్యటించారు. ఆరున్నర సంవత్సరాల తర్వాత, మేము ఈ వారంలో పిల్లలమర్రిని తిరిగి ప్రారంభిస్తున్నాము. పిల్లలమర్రి చెట్టు పునఃప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి రావాల్సి ఉండగా, బిజీ షెడ్యూల్‌ కారణంగా రావడం లేదని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..

Show comments