NTV Telugu Site icon

MLC Elections: ప్రశాంతంగా సాగుతున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్..!

Mahaboob Nagar

Mahaboob Nagar

MLC Elections: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. షాద్ నగర్ నియోజకవర్గానికి సంబందించి ఎంపిడిఓ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి క్యాంప్ ల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు బస్సుల్లో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో రెండు పార్టీల కార్యకర్తలు పెద్దయెత్తున పోలింగ్ కేంద్రం దగ్గర మోహరించారు.

దీంతో వారిని లైన్‌ ల వారీగా లోపలికి అనుమతించారు. ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరిని పరిశీలిస్తూ ఓటింగ్‌ కు అనుమతిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల బందోబస్తు,144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీంల ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించనున్నారు.

Read also: Viral Murder: తన నేరాన్ని దాచడానికి సొంత సోదరిని చంపిన కిరాతక అన్న..!

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగనుంది. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఓటర్లు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు.

కోడంగల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శాసనమండలి ఎన్నిక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల అనంతరం ఎక్స్ – అఫీషియో హోదాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జీవన్ రెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు.

ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఎమ్మెల్సీ ఓటర్ కేంద్రం వద్ద కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. తనతో పాటు టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉన్నారు..
Purandeswari: విధ్వంసకర పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి..