Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో హమాలీలపై సీఐ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. వీఆర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, హమాలీలను దూషించాడనే ఆరోపణలపై హమాలీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా హమాలీలు నరసింహుల పేట పీఏసీఎస్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో లారీలలో యూరియా దిగుమతి ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. రైతులకు పంపిణీ చేయాల్సిన ఎరువులు నిలిచిపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Godavari Maha Pushkaram: గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం
అయితే, విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని హమాలీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తూ, సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ జోక్యంతో హమాలీలు శాంతించగా, యూరియా పంపిణీ ప్రక్రియ మళ్లీ స్టార్ట్ అయింది. ఈ సంఘటనపై స్థానికులు సీఐ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.