NTV Telugu Site icon

మూసీ కాల్వలో మురికి ఎంతనో.. టీఆర్‌ఎస్‌ నేతల అవినీతి అంత : మధుయాష్కీ గౌడ్‌

టీఆర్‌ఎస్‌ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్‌ఎస్‌ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు.

తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు.. ఎందుకు విదేశీ వ్యాపారం పై రైడ్స్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆత్మహత్యలు ఆగలేదని, నిరుద్యోగ యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న స్థానాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా కేసీఆర్‌కు సోయి లేదని మధు యాష్కీ అన్నారు.

సీఎం కేసీఆర్ స్వంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని, కోటి ఎకరాల మాగాణి అంటూ.. వరి వేస్తే ఉరి అని ఎందుకు అంటున్నారని మధు యాష్కీ ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది.. అందులో కేసీఆర్‌ గొప్పతనం ఏమీ లేదు, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనకుంటే.. గొర్రెలు, బర్రెలు అంటున్నారన్నారు. రాహు కాలం.. రావుల కాలంలో ఏమీ రావన్నట్లు పరిస్థితి తయారైందని, ఇక టీఆర్‌ఎస్‌ వీఆర్‌ఎస్‌ పలకాల్సిన సమయం వచ్చిందని మధు యాష్కీ అన్నారు.