NTV Telugu Site icon

Madhu Goud Yaskhi: రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

Madhu Yaskhi Open Letter To Revanth Reddy

Madhu Yaskhi Open Letter To Revanth Reddy

రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు.

‘‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్న ఆ వర్గాలు.. తాము సాధించుకున్న తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్లు మాత్రమే నాయకత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి’’ అంటూ మధుయాష్కీ ఆ లేఖలో రేవంత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా మీకు, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తాయని ఆయన హెచ్చరించారు.

2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని రేవంత్‌కి మధుయాష్కీ సూచించారు. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అవమాన పర్చేలా, కించపర్చేలా ఉన్నాయన్నారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉంటూ బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం తగదన్నారు. ఆ వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని.. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ్డ ఆందోళనను, గందరగోళాన్ని నివృత్తి చేయాలని మధుయాష్కీ గౌడ్ తన లేఖలో రేవంత్ రెడ్డిని కోరారు.