సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. ఆయన వెంట భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వున్నారు. ఉదయం 11గంటల 20 నిముషాల టైంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది.
సోమాజిగూడలో వున్న సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. పలువురు టీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్ద వున్నారు. గత కొంతకాలంగా సీఎం నీరసంగా వున్నారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. గతంలో కరోనాకు గురయినప్పుడు డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలోనే చికిత్స అందుకున్నారు. తాజాగా ఆర్థికమంత్రి హరీష్ రావు కూడా యశోదకు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ వైద్యపరీక్షలపై డాక్టర్ ఎం.వి.రావు వివరణ. ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు.దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం అన్నారు డాక్టర్ ఎంవీ రావు.
సీఎం కేసీఆర్ కి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. వారు స్టేబుల్ గా ఉన్నారు. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే అన్నారు డాక్టర్ ఎంవీ రావు.