NTV Telugu Site icon

Kishan Reddy: కిషన్‌రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు లైన్‌క్లియర్

Kishanreddy

Kishanreddy

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ప్రతిష్టంభన తొలగింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడి పరిస్థితిని వివరించారు. రైతులను ఆదుకోవాలని కోరారు. కిషన్ రెడ్డి వినతికి కేంద్ర జౌళి శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరపాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను గిరిరాజ్ సింగ్‌ ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగనున్నాయి.

ఇది కూడా చదవండి: Zomato Food Rescue: కొత్త ఫీచర్‭తో సగం ధరకే ఫుడ్ అందించనున్న జొమాటో

పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నియమ నిబంధనలనే ఈ ఏడాది పాటించనుంది. ఇక కొనుగోలు కేంద్రాలను సైతం గత ఏడాది ఏర్పాటు చేసిన సంఖ్యకు తక్కువ కాకుండా ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7350 చొప్పున సీసీఐ కొనుగోలు చేయనుంది. పత్తి రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు సృష్టించే తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మి దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: IG V. Satyanarayana: అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు.. దాడి చేసిన వారిని వదలం

Show comments