Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్‌లో సందడి.!

  • లక్ష్మీస్ ఎంపీరియాలో ఘనంగా 5K రన్ నిర్వహణ
  • యోగా దినోత్సవం, ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
  • మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభం
  • వర్షంలోనూ ఉత్సాహంగా పాల్గొన్న కమ్యూనిటీ సభ్యులు
5k

5k

Lakshmis Empiria : ప్రపంచ యోగా దినోత్సవం , ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) పురస్కరించుకుని మియాపూర్‌లోని ‘లక్ష్మీస్ ఎంపీరియా’ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 5కే రన్ (5K Run) కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్ , పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ పరుగును చేపట్టారు. లక్ష్మీస్ ఎంపీరియా కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీను ముప్పరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

జెండా ఊపి ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్

ఈ 5కే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ హాజరయ్యారు. ఆయన జెండా ఊపి పరుగును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంపొందించడం అందరి బాధ్యతని గుర్తు చేశారు. ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమేనని, పచ్చదనాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

×
×
Ad

వర్షాన్ని సైతం లెక్కచేయని రన్నర్స్

ఈ అవగాహన పరుగులో కమ్యూనిటీకి చెందిన చిన్నారులు, యువత, మహిళలు , వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహపరిచారు. కార్యక్రమం జరిగే సమయంలో వర్షపు వాతావరణం ఉన్నప్పటికీ, రన్నర్స్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో జోష్‌తో పరుగెత్తారు. వాతావరణం ఎలా ఉన్నా ఆరోగ్యకరమైన జీవన విధానానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామంటూ అందరూ ఉత్సాహంగా ముందుకు సాగారు.

ఘనంగా సహకరించిన స్పాన్సర్లు

ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి పలు ప్రముఖ విద్యా, వైద్య, ఆర్థిక సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించి తమ పూర్తి సహకారాన్ని అందించాయి. ఇందులో ప్లాటినమ్ స్కూల్స్ (మయూరి నగర్), కాల్షియం హాస్పిటల్ (హైదర్‌నగర్), యాక్సిస్ బ్యాంక్ (జేపీ నగర్ శాఖ), ఎస్‌బీఐ (మయూరి నగర్), శ్రీకార జూనియర్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ (మియాపూర్), లక్ష్మీ ఇన్‌ఫ్రా , క్యాస్కేడ్స్ ది నియోపోలిస్ (కోకాపేట్) సంస్థలు ఉన్నాయి. కమ్యూనిటీ సభ్యులంతా కలిసికట్టుగా పాల్గొనడంతో ఈ 5కే రన్ గ్రాండ్ సక్సెస్ అయింది.