Site icon NTV Telugu

KTR: కాంగ్రెస్‌తో పొత్తుపై కేటీఆర్ బాంబ్

Ktr Fires On Rahul

Ktr Fires On Rahul

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించిన రైతు సంఘర్షణలో సభలో తాము ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోమని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ విషయంపై వరంగల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ స్పందించారు. అసలు కాలం చెల్లిన కాంగ్రెస్‌తో ఎవరు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటారంటూ ఛలోక్తులు పేల్చారు. దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు ఎవరూ లేదరని, అసలు ఆ పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అంటూ సెటైర్ వేశారు. సొంత నియోజకవర్గంలోనే ఒక ఎంపీగా గెలవని రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్‌ని గెలిపిస్తారా? అంటూ మరో పంచ్ విసిరారు.

గాంధీ భవన్‌ను కాంగ్రెస్ గాడ్సేకి అప్పగించిందని చెప్పిన కేటీఆర్.. ఎవరో రాసిన స్క్రిప్టుని రాహుల్ చదివారన్నారు. రైతుల ఆత్మహత్యలు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. ఏఐసీసీ అంటూ ఆలిండియా క్రైసిస్ కమిటీ అని ఎద్దేవా చేసిన కేటీఆర్.. నిజంగానే కాంగ్రెస్ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే, పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. వరంగల్‌లో ప్రకటించిన డిక్లరేషన్‌లో కొత్త అంశాలేవీ లేవని, 2018లో చెప్పిన విషయాల్ని మళ్ళీ రిపీట్ చేశారన్నారు. ధాన్యం గురించి రాహుల్ పార్లమెంట్‌లో ఏనాడూ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, నిరంతర విద్యుత్తు, రైతు బీమా, వలసలు లేని ఊరు లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలేవీ కాంగ్రెస్ హయాంలో లేవన్నారు.

కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే, కేసీఆర్ గొప్ప శక్తిగా మార్చారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నేతలు పాతర వేస్తే, తాము జాతర లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చామన్నారు. రుణమాఫీ చేయలేదని విమర్శిస్తున్నారని, తాము రుణమాఫీ చేశామో లేదో అన్నదాతకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని, వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటల్ని ఎవ్వరూ విశ్వసించొద్దని తెలంగాణ రైతన్నలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version