ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనులు చేపట్టాలని శుక్రవారం తొలిసారిగా అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అన్నారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్‌ఎండీఏ కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. దేశంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణాకు హైదరాబాద్ మణిహారంగా మారిందని, అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా స్వరాష్ట్రం వచ్చిన తరువాత ఎంతో అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందని ఆయన అన్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఎన్నో నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. అనంతరం ఇంజినీరింగ్, ప్లానింగ్, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్‌ల ద్వారా జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి సమీక్షించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
