రాష్ట్రంలో కరువు కష్టాలు నమ్ముకుని జనాలు అల్లాడిపోతుంటే, సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం మూసీ సుందరీకరణే లోకంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిచ్చినట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి” అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కరువని ఆరోపించారు. తాము ఎంత చెప్పినా వినకుండా వెయ్యి టీఎంసీల నీటిని దిగువకు వదిలేయడం వల్లే ఇవాళ ఈ దుస్థితి వచ్చిందన్నారు.
మూసీ సుందరీకరణపై మండిపాటు..
రాష్ట్రంలో 365 మండలాలు కరువులో ఉన్నాయని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించిందని, అయినా కూడా మూసీ సుందరీకరణంటూ హడావుడి చేయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి డీపీఆర్ (DPR) లేదని, దమ్ముంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సవాల్ విసిరారు. మూసీ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్‌కు జనాలను రానీయకుండా అడ్డుకున్నారని, చివరికి మా పార్టీ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పబ్లిక్ లేకుండానే హియరింగ్ నిర్వహించడం ఏంటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి దిక్కులేదు కానీ, మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీళ్లు తెచ్చి మూసిలో పోస్తామనడం ‘మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు.
అంబేద్కర్ రాజ్యాంగమా.. అనుముల రాజ్యాంగమా?
రాష్ట్రంలో అసలు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందా లేక అనుముల రాజ్యాంగం నడుస్తోందా అని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ హయాంలో లిఫ్ట్‌ల ద్వారా పొలాలకు నీళ్లొచ్చాయని, కానీ ఇవాళ మళ్లీ ట్యాంకర్ల మోత మోగుతోందని, ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. ఏది అడిగినా ప్రభుత్వంలో పైసలు లేవంటున్నారని, మరి లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. పరిశ్రమలకు, ఐటీ కారిడార్‌కు పవర్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని, ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న గ్లోబల్ సమ్మిట్ కాదని, అది ‘గోబెల్స్ సమ్మిట్’ అని విమర్శించారు.
రైతులను ఆదుకోవాలి.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు
ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరును కేటీఆర్ అభినందించారు. కరువు సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతి నీటి చుక్కను వడిసిపట్టిందని, చంద్రబాబును తాను అభినందిస్తున్నానని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ మోసాలతో రైతులు గోస పడుతున్నారన్నారు. ఎగ్గొట్టిన రైతు భరోసాతో పాటు ఎకరాకు రూ. 60 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూసీ కోసం అనుకుంటున్న లక్షన్నర కోట్లను రైతులను ఆదుకునేందుకు మళ్లించాలని కోరారు. బాధితుల తరఫున తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

