Site icon NTV Telugu

KTR:సిరిసిల్ల క‌లెక్ట‌ర్ కు కేటీఆర్ కాల్ ?

Rajanna

Rajanna

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల జరిగిన న‌ష్టాన్ని కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ వివ‌రించారు.

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. ఎల్లారెడ్డి పేట మండల స్థాయి అధికారులతో తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పంట నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసున్నారు.

కాగా.. అకాల వ‌ర్షం రైతుల‌ను తీవ్ర నిరాశ ప‌రిచింది. నిర్మ‌ల్, జగిత్యాల‌, సిరిసిల్ల‌, కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో.. బిచ్కుంద, నాగిరెడ్డి పెట, బాన్స్ వాడ, ఎడపల్లిలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిన ముద్దైంది. అకాల వ‌ర్షంతో త‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లింద‌ని రైతులు వాపోతున్నారు. త‌డిసిన ధాన్యాన్ని ఆర‌బెట్టేందుకు రైతులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. పాఠన్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం భారీ న‌ష్టాన్ని క‌లిగించింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిజమాబాద్ లో 7 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. కామారెడ్డి జిల్లా బిబిపేటలో అత్యధికంగా 8 సెంటిమీటర్ల వ‌ర్ష‌పాతం నెల‌కొంది.

జూన్‌ 8లోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. రాగల 24 గంటల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని తెలిపింది. జూన్‌ 8లోగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది.

Somu Veerraju: ద్వారంపూడిపై చర్యలకు గవర్నర్ కి లేఖ

Exit mobile version