కృష్ణా బోర్డు త్రీ మెంబర్ కమిటీ సమావేశంలో నీటి కేటాయింపులపై తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఇప్పటికే 9 టీఎంసీల నీటిని కోరిన ఆంధ్రప్రదేశ్, తాజా భేటీలో అదనంగా మరో 10 టీఎంసీలు కావాలని ప్రతిపాదించింది. దీంతో కృష్ణా జలాల పంపిణీపై సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. ఏపీ డిమాండ్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనంగా అడిగిన 10 టీఎంసీల నీటిలో చుక్క కూడా ఇవ్వబోమని తెలంగాణ స్పష్టం చేసింది. తాగునీటి అవసరాల దృష్ట్యా ఇటువంటి కేటాయింపులకు అంగీకరించలేమని తేల్చి చెప్పింది.
30 టీఎంసీల కోసం తెలంగాణ డిమాండ్
రానున్న మూడు నెలల పాటు తాగునీటి అవసరాలను తీర్చడానికి తమకు 30 టీఎంసీల నీరు అవసరమని తెలంగాణ కమిటీ ముందు కోరింది. వేసవి, రాబోయే నెలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు కేటాయింపులు చేయాలని పట్టుబట్టింది. ఇరు రాష్ట్రాల వాదనలు, డిమాండ్లతో ఉదయం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు త్రీ మెంబర్ కమిటీ మధ్యాహ్నం మళ్లీ సమావేశం కానుంది.

