NTV Telugu Site icon

Komatireddy Brothers: తమ్ముడి దూకుడు.. అన్న సైలెంట్..! అదో వ్యూహమేనా..?

Komatireddy Brothers

Komatireddy Brothers

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్‌ టాపిక్‌.. పరిణామాలు, ఆయన ప్రకటనలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి.. సీఎం కేసీఆర్‌పై త్వరలో యుద్ధ ప్రకటన చేయబోతున్నాం, నేను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తే లేదు, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తాం, మునుగోడు వేదికగా ముందుకు వెళ్తా నంటూ ఆయన తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడంతో.. ఇక ఎవ్వరూ ఆయన్ను ఆపలేరా? అనే ప్రశ్న ఎదురవుతుంది..? అయితే, పార్టీ మారకుండా ఆయన్ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ఢిల్లీ వేదికగా కేసీ వేణుగోపాల్‌ నివాసంలో.. సమావేశమైన ఠాగూర్‌, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌పై చర్చించారు.. ఆయన్ను బుజ్జగించే బాధ్యత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు.. అంతేకాదు.. కోమటిరెడ్డి ఫ్యామిలీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను కూడా రంగంలోకి దింపారు.. ఇక, బీజేపీ మాత్రం.. ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసే పార్టీ కండువా కప్పుకోమని ఆహ్వానిస్తున్నారట.. దీంతో, వరుసగా తన నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయలు తీసుకునే పనిలోపడిపోయారు రాజగోపాల్‌ రెడ్డి.. అయితే, పార్టీలో.. బయట ఇంత రచ్చ జరుగుతున్నా.. ఆయన సోదరుడైన భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మౌనంగానే ఉన్నారు.. దీనిపై సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి.. మరి కోమటిరెడ్డి మౌనం కూడా ఒక వ్యూహమేనా? అనే కొత్త చర్చ సాగుతోంది.

Read Also: Chandrababu Naidu: నేను చేసి చూపిస్తా.. సీఎం జగన్‌కు సవాల్

కేసీ వేణుగోపాల్‌ నివాసంలో జరిగిన భేటీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు.. కానీ, ఠాగూర్‌తో జరిగిన ఆ సమావేశానికి రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌ హాజరైనా.. కోమటిరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు.. ఆయన ఎందుకు ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు..? తమ్ముడి వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారిందా? సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందా? అనే చర్చ ఓవైపు సాగుతుంటే.. ప్రత్యర్థులపైనే కాదు.. పార్టీలోని పరిణామాలపై కూడా గట్టిగా మాట్లాడే వెంకట్‌రెడ్డి మౌనం వెనుక వ్యూహం ఏంటి? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఈ విషయంలో ఇప్పటికే సీనియర్‌ నేత వి. హనుమంతరావు.. కోమటిరెడ్డిని నిలదీశారు.. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న మీరు.. తమ్ముడు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కానీ, సెలైంట్‌గా తన పని చేసుకుపోతున్న కోమటిరెడ్డి.. తమ్ముడి వ్యవహారం, రాజకీయాలపై ఎక్కడా స్పందించడంలేదు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గతంలోనూ తమ్ముడి వ్యవహారం కొంత ఇబ్బంది పెట్టింది.. తెలంగాణలో టీఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇక కాంగ్రెస్‌ పని అయిపోయింది.. టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని కుండ బద్ధలు కొట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. అంతే కాదు.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కూడా కురిపించారు.. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.. పార్టీలోకి కొత్తగా వచ్చినవారినే అందలం ఎక్కిస్తున్నారంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేసిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు విలువ లేదు.. ఉద్యమంలో పాల్గొన్నవారికి గుర్తింపు లేదని ఫైర్‌ అయ్యారు. ఇక, ఎమ్మెల్యేలు పార్టీ వీడితే.. పీసీసీ చీఫ్‌ (ఉత్తమ్‌)ను మార్చకుండా అధిష్టానం తప్పుచేసిందన్న ఆయన.. తానే సీఎల్పీ నేతగా ఉంటే.. చూస్తూ ఊరుకునేవాడినే కాదన్నారు. అయితే, అప్పట్లో రాజగోపాల్‌రెడ్డి కామెంట్లపై వెంకట్‌రెడ్డికి ప్రశ్నలు ఎదురైన సమయంలో.. తనకు తమ్ముడి వ్యవహారం తెలియదని.. తాము రాజకీయాల గురించి మాట్లాడుకోమని.. అసలు.. మేం కలిసే ఉండమని.. లాంటి సమాధానాలు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఎక్కడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు.

అయితే, ప్రస్తుతం తమ్ముడి రాజకీయాలపై ఎక్కడా సమాధానాలు ఇవ్వకపోయినా.. తాను కాంగ్రెస్‌ వెంటే అనేది తన కార్యాచరణతో స్పష్టం చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. విజయ దశమి నుంచి తాను పాదయాత్ర చేయబోతున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ తరపున ఆయన పాదయాత్ర చేయబోతున్నారు.. దీంతో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా.. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని గతంలో ప్రకటించిన ఆయన.. మరోసారి అదే స్టాండ్‌కు కట్టుబడి ఉన్నట్టు సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.. అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంచిపేరే ఉంది.. యువ నేతలుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్నారు.. అంతే కాదు.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా కూడా బాధ్యతలు నిర్వహించారు.. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా ఉంటే.. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇచ్చిన తర్వాత బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకట్‌రెడ్డి.. స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత సైలెంట్‌ అయ్యారు.. ఇంత జరుగుతున్నా తమ్ముడి ఎపిసోడ్‌పై స్పందించకపోవడం వెనుక ఆయన వ్యూహమేంటి? మౌనం వెనుక ఏదైనా? ప్లాన్‌ ఉందా? అనే చర్చ సాగుతోంది..