Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : అందుకే పార్టీ వీడుతున్నా.. సోనియాగాంధీకి లేఖ

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

MLA Komatireddy Rajgopal Reddy Letter to Sonia Gandhi.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరమవడం పెద్ద దెబ్బేనని చెప్పాలని.అయితే ఇటీవల రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడనున్నట్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పించేందుకు ఈ నెల8న స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు రాజగోపాల్‌ రెడ్డి. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేక రాశారు రాజగోపాల్‌ రెడ్డి. ఆ లేఖలో పార్టీనీ ఎందుకు వీడుతున్నారో వివరించారు. సోనియా గాంధీకి రాసిని లేఖలో ‘ ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులు, మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేదు.

తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్ఎల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగామరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎం.ఎల్.ఏ పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు.’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

 

Exit mobile version