congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. కోమటి రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో సమావేశం ప్రారంభం అయింది. రాజగోపాల్ రెడ్ది వ్యవహారంపై జరుగుతున్న ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, నల్లగొండ ముఖ్య నేతలతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Uttar Pradesh Crime: 2009లో భర్తకు జైలు శిక్ష.. 2022లో ప్రాణాలతో తిరిగొచ్చిన భార్య
రాజగోపాల్ రెడ్ది పార్టీ వీడకుండా..చూడాలని గతవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో చర్చించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి నచ్చచెప్పేందుకు పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించినా.. ఆయన మెత్తబడలేదు. దీని తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు నచ్చచెప్పాలని చూసినా.. పార్టీని వీడేందుకే రాజగోపాల్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జగింపు చర్యలు ద్వారా ఫలితం రాకపోవడంతో.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే ఎలాంటి నష్టాలు ఉంటాయనే దానిపై.. నివారణ చర్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చర్చిస్తోంది.
