Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!

  • బాధిత కుటుంబానికి పరామర్శ
  • రాహుల్ అరెస్ట్‌పై తీవ్ర నిరసన
  • సోనమ్ వాంగ్‌చుక్ అంశంపై స్పందన
  • కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడాలన్న విజ్ఞప్తి
Komatireddy

Komatireddy

Komatireddy Rajgopal Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. కొద్దిరోజుల క్రితం మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీటీసీ యాదయ్య కుమారుడికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

జాతీయ పరిణామాలపై తీవ్ర నిరసన

బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, జాతీయ రాజకీయ పరిణామాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే లడఖ్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడి మార్గదర్శనం చేయాల్సిన ప్రభుత్వాలే, వారిపై లాఠీలతో దాడికి దిగడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి

అనంతరం పార్టీ అంతర్గత వ్యవహారాలు , కార్యకర్తల సంక్షేమంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్‌ను గద్దె దించాలనే ఆకాంక్షతో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చాక గెలిపించిన సొంత కార్యకర్తలపైనే కేసులు పెట్టడం అత్యంత బాధాకరమని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఒకలా, మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న వారిని మరొకలా చూడకూడదని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న పాత కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ , పీసీసీ అధ్యక్షులు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు.