Komatireddy Rajagopal Reddy Arrested In Munugode: ఉప ఎన్నిక సందర్భంగా గొల్ల కురుమ ఎకౌంట్స్‌లో వేసిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసిందని.. ఆ సీజ్ ఎత్తివేకపోయకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన బైఠాయించారు. దీంతో.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా.. బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత నడుము ఆయన్ను పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తొలిసారి మునుగోడు నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా చౌటుప్పల్‌లో భారీ స్వాగత కార్యక్రమంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే చండూరులో టీఆర్‌ఎస్ పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో.. నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఉప ఎన్నిక సందర్భంగా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు తాత్సారం చేస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్ల కురుముల ఎకౌంట్స్ ప్రీజ్ చేయడంతో.. వాళ్ళ సొంత డబ్బులు కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
ఎకౌంట్లో వేసిన సొమ్మును ప్రభుత్వం తిరిగి వెనక్కు తిరిగి తీసుకోవాలని చూస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. వెంటనే ఎకౌంట్ల ఫ్రీజ్ ఎత్తివేయాలని.. లేకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామన్నారు. గతంలో రైతు బంధు ఇస్తానని చెప్పి దళితుల్ని మోసం చేశారని, ఇప్పుడు గొల్ల కురుముల ఎకౌంట్స్‌ని ఫ్రీజ్ చేసి మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రతి వర్గానికి హామీలు ఇచ్చి, మోసం చేశారని మండిపడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి చేసేదాకా తమ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో, మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది.