Site icon NTV Telugu

Kodanda Reddy: ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లైంది

Kodanda Reddy On Dharani

Kodanda Reddy On Dharani

ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో చనిపోవడానికి భూ సమస్యలే కారణమన్నారు.

కాంగ్రెస్ హయాంలో భూ సమస్యలేవీ రాలేదని పేర్కొన్న కోదండరెడ్డి.. ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లైందన్నారు. అసైన్డ్ భూములను అడ్డగోలుగా గుంజుకుంటున్నారని, అధికార పార్టీ నేతలు వాటిని వెంచర్లుగా వేసుకొని కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్ని సవరించాలని కోరిన కోదండరెడ్డి.. భూ సమస్యల్ని పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. ఈ రచ్చ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ విజయారెడ్డి హాజరయ్యారు.

Exit mobile version