Kishan Reddy: డ్రగ్స్ మహమ్మారిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన పోరాటం ఇప్పుడు సామాన్యుల ఇళ్లలోకి కూడా చేరింది. హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఆయన నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ముగింపు సభలో కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన ఈ చిన్న ప్రయత్నం గురించి నేడు సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన పాదయాత్ర పూర్తిగా రాజకీయాలకు అతీతంగా సాగిందని, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం బలపడిందని స్పష్టం చేశారు.
సభలో యువతను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “మన దేశానికి యువతే అసలైన ఆస్తి. మెడికల్, ఐటీ, క్రీడలు, విద్య, సర్వీస్ సెక్టార్ ఇలా అన్ని రంగాల్లో మన యువత కొత్త ఆవిష్కరణలతో ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి యువశక్తిని కాపాడుకునేందుకే 2029 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ సాధించాలని ప్రధాని మోడీ సంకల్పించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. తన మూడు రోజుల నడకలో బస్తీ మహిళల నుంచి యూనివర్సిటీల వీసీలు, డాక్టర్లు, విద్యార్థులు, సినీ, ఆధ్యాత్మిక ప్రముఖుల వరకు స్వచ్ఛందంగా కదిలిరావడం ఉద్యమానికి మరింత బలాన్నిచ్చిందని కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సభలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ నుంచి కాపాడేందుకు బాధ్యత గల కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సినీ పరిశ్రమ నుంచి డబ్బులు తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రగ్స్ కేసులను తొక్కిపెట్టిందని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి తప్ప, చేతలు సచివాలయం దాటవని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం రెండూ ‘దొందూ దొందే’ అన్నట్లుగా మారాయని వ్యాఖ్యానించిన ఆయన, దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించిన ప్రధాని మోడీ నాయకత్వంలోనే నషా ముక్త్ భారత్ సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

