Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు

  • ముత్తగూడెం వద్ద కారు బోల్తా.. ఇద్దరు మృతి
  • వైరా వద్ద లారీ పల్టీ.. ఒకరికి తీవ్ర గాయాలు
  • చింతలపూడి సమీపంలో ట్రావెల్ బస్సుకు ప్రమాదం
  • ఒకే రోజు వరుస ప్రమాదాలతో వాహనదారుల్లో భయం
Accident

Accident

Greenfield Highway : ఖమ్మం జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే రక్తసిక్తమైంది. శనివారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై అతివేగంతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు రైలింగ్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారులోని మరో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ఖమ్మంలో షాపింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వైరా వద్ద లారీ పల్టీ.. ఒకరికి తీవ్ర గాయాలు

ఇదే గ్రీన్ ఫీల్డ్ హైవేపై వైరా సమీపంలో మరొక ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక లారీ రోడ్డుపై అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో లారీలోని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఏపీ సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే రోజు గ్రీన్ ఫీల్డ్ హైవేపై వరుసగా మూడు ప్రమాదాలు జరగడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేగ నియంత్రణ లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.