Site icon NTV Telugu

టి.పీసీసీ… సీనియర్‌ నేతలకు కీలక పదవులు..!

Congress

Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని ఆహ్వానించాలనే దానిపై జిల్లా నాయకులు… సీనియర్ల అభిప్రాయం తీసుకునేందుకు పీసీసీ ఓ కమిటీ వేయాలని చూస్తోంది. ఈ కమిటీ బాధ్యతలు సీనియర్ నాయకులకు ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. తనకు సన్నిహితుడైన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి చేరికల కమిటీకి చైర్మన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మరో కీలకమైన పదవి… క్రమశిక్షణ కమిటీ చైర్మన్.. పార్టీలో నాయకులలో క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగానే.. కౌశిక్ రెడ్డిని 24 గంటల గడువు ముగియక ముందే బహిష్కరణ చేసేశారు. ఉత్తమ్‌కి సన్నిహితుడు అయినా గీత దాటితే… వేటు తప్పదనే సంకేతం పంపారు. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా సీనియర్ నాయకుడు జానారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. ఈ పదవి తీసుకోవడానికి జానారెడ్డి ఒప్పుకొంటారా..? తన సీనియారిటీ ముందు క్రమశిక్షణ కమిటీ చిన్నదిగా భావిస్తారా..? అనే టాక్ కూడా నడుస్తోంది.. పార్టీ పదవుల పంపకంపై ఒకటి.. రెండు రోజుల్లో కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టనుంది. అయితే ఈ రెండు కమిటీలపై వీలైనంత త్వరగా నిర్ణయం జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Exit mobile version