KCR : చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్‌కు విచ్చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనను దూషించడమే కాంగ్రెస్ సర్కార్ ఒక విధానంగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఒక్క కొత్త ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రకటించకపోగా, గతంలో ఉన్న పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను ఆపేశారని, బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారని, యూరియా కోసం రైతులు మళ్ళీ క్యూలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ముఖ్యంగా సాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతోందని కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. ఈ సమస్యపై త్వరలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో ఒక కార్యాచరణను ప్రకటించి, ప్రత్యక్షంగా రైతుల వద్దకు వెళ్తామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ గుర్తు లేకుండానే బీఆర్ఎస్ మద్దతుదారులు మెరుగైన ఫలితాలు సాధించారని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన అన్నారు. భవిష్యత్తులో రాబోయే మున్సిపల్, ఎంపిటీసి, జడ్పిటీసి , జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 2026 సంవత్సరం మొత్తం ఎన్నికల సంవత్సరంగా ఉండబోతోందని, పార్టీ శ్రేణులన్నీ ఇప్పుడే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమకు నేర్పిస్తోందని, భవిష్యత్తులో తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
FSSAI: గుడ్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన FSSAI
