KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జిల్లా సాగునీటి కష్టాలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం కృష్ణా బేసిన్‌లో ఉన్నప్పటికీ, జిల్లా ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం అలమటించారని, పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ గుర్తించినా.. పాలకుల నిర్లక్ష్యం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బచావత్ కూడా పాలమూరు జిల్లా దుర్భర పరిస్థితిని చూసి చలించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో పాలమూరు గురించి గంటెడు నీళ్లు అడిగే నాథుడే లేడని, అందుకే ట్రిబ్యునల్ స్వయంగా స్పందించి జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీల నీటిని కేటాయించిందని చెప్పారు. అయితే, 1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ, ఉమ్మడి పాలకులు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దశాబ్దాల పాటు కాలువలు లేక జూరాల ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దత్తత తీసుకుని ద్రోహం చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. “మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నాను” అని ప్రకటించిన చంద్రబాబు, కేవలం పునాది రాళ్లు వేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు రాళ్లు వేశారే తప్ప, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కర్ణాటకకు చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించలేదని, తాను ఉద్యమ సమయంలో చేసిన పోరాటం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
వలసల గోస – ఉద్యమ బాట సాగునీరు లేక జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి బొంబాయికి బస్సులు ఉండేవని, జిల్లా మొత్తం కరువు కోరల్లో చిక్కుకుందని కేసీఆర్ వివరించారు. గోరేటి వెంకన్న గారు రాసిన “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” అనే పాట జిల్లా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టిందని చెప్పారు. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తాను జోగులాంబ నుండి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టానని కేసీఆర్ స్పష్టం చేశారు.
