Site icon NTV Telugu

KCR : సిట్‌కు కేసీఆర్ 6 పేజీల ఘాటు లేఖ.. నోటీసులు అక్రమం.. అయినా విచారణకు వస్తా.!

Kcr Speech

Kcr Speech

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత, మాసీ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సుదీర్ఘంగా రాసిన ఆరు పేజీల లేఖలో ఆయన పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లోని తన నంది నగర్ నివాసం గోడపై నోటీసును అతికించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జూబ్లీహిల్స్ ఏసీపీకి తనపై ఇటువంటి నోటీసులు జారీ చేసే అధికార పరిధి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

Viral : టాబ్లెట్ షీట్ అనుకున్నారా..? అది వెడ్డింగ్ కార్డు..!

చట్టంలోని నిబంధనలను ఉటంకిస్తూ కేసీఆర్ పోలీసుల తీరులోని లోపాలను ఎత్తిచూపారు. బిఎన్ఎస్ఎస్ (గతంలో CrPC) సెక్షన్ 160 ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను విచారించాల్సి వస్తే, అది వారి నివాసం వద్దే జరగాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని ఆయన గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లి గ్రామమని, నిబంధనల ప్రకారం అక్కడే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో హరీష్ రావు నోటీసుల విషయంలో పాటించిన పద్ధతులను, తన విషయంలో పోలీసులు పాటిస్తున్న వైఖరిని పోల్చి చూపిస్తూ.. పోలీస్ శాఖ ‘డబుల్ స్టాండర్డ్స్’ పాటిస్తోందని విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్న చిరునామాకు, ప్రస్తుతం తాను నివసిస్తున్న చోటికి మధ్య వ్యత్యాసాన్ని గమనించకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖలో కేసీఆర్ సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ‘సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సీబీఐ’ కేసు తీర్పు ప్రకారం, వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల్లో నోటీసులు పంపడం చట్టబద్ధం కాదని ఆయన వెల్లడించారు. పోలీసులు కావాలనే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, వారి చర్యలు ఆర్టికల్ 14 , 21లకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఒకవేళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన ఈ నోటీసులను తాను విస్మరించవచ్చని, అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల తీరుపై ఎన్ని అసహనాలు ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నేతగా దర్యాప్తుకు తన వంతు సహకారం అందిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు తాను విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అయితే పోలీసులు అడిగినట్లు కాకుండా, తన నంది నగర్ నివాసంలోనే విచారణ జరపవచ్చని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తనకు పంపే ఏవైనా నోటీసులు లేదా సమాచారం ఉంటే వాటిని తన ఎర్రవల్లి నివాసానికే పంపాలని పోలీసులకు సూచించారు.

Google Big Update: మీ ఫోన్ దొంగిలించినా డేటా సేఫ్.. Gmail లో జెమిని మ్యాజిక్.!

Exit mobile version