Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!

  • కాజీపేటలో పోలీసుల వాహన తనిఖీలు
  • కారులో బయటపడ్డ భారీగా రద్దు చేసిన నోట్లు
  • ముఠా నుంచి 10 ఫోన్లు, కారు స్వాధీనం
  • మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? దర్యాప్తు
Old Currency

Old Currency

హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తా సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో డీమోనిటైజ్డ్ (రద్దు చేసిన) పాత కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లతో అమాయక ప్రజలను మోసం చేసి, చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

మోసపూరిత నెట్‌వర్క్ గుట్టురట్టు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట చౌరస్తా వద్ద సీఐ జక్కుల శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపి సోదా చేయగా రద్దు చేసిన పాత నాణాలు, నోట్లు బయటపడ్డాయి. నిందితులు పాత కరెన్సీ నోట్లను చూపించి ప్రజల వద్ద నుంచి అసలైన చెల్లుబాటు అయ్యే నగదును కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది.

రూ.1.38 కోట్ల పాత నోట్లు స్వాధీనం

నిందితుల నుంచి రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత కరెన్సీ నోట్లతో పాటు, ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న రూ.6 వేల నగదు, 10 సెల్‌ఫోన్లు , నేరానికి ఉపయోగించిన ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ముఠా సభ్యులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.