Kalvakuntla Kavitha : చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కవిత మాట్లాడుతూ.. “చింతమడక గ్రామం చరిత్ర సృష్టించిన ప్రదేశం. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు ఈ మట్టిలో నుంచే వేశారు. అందుకే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ గ్రామం నుంచి ప్రారంభమైన ఉద్యమం చరిత్రను మార్చింది. చాలా ఏళ్లుగా నేను ఇక్కడికి రాలేదు, కానీ ప్రత్యేక పరిస్థితుల్లోనూ మీ ఆహ్వానం మేరకు వచ్చాను. చిన్నప్పటి నుంచే చింతమడకలో కుల, మత భేదాలు లేకుండా పండగలు చేసుకునే వాతావరణం ఉంది. అదే నేర్పు నాకు ఎప్పటికీ ప్రేరణగా ఉంది. ఈ నేల ఇచ్చిన ధైర్యంతోనే నేను రాష్ట్రమంతా తిరిగి బతుకమ్మ నిర్వహించగలిగాను” అని చెప్పారు.
ఆమె మరోవైపు గతాన్ని గుర్తు చేసుకుంటూ, “2004లో ఉద్యమం మొదలైన తర్వాత కేసీఆర్ మరొకరిని ఇక్కడికి తీసుకువచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సిద్దిపేటకో, చింతమడకకో రావాలన్నా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంక్షల మధ్యనే వచ్చాను. కొందరు సిద్దిపేట, చింతమడకలను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా భావిస్తున్నారు. కానీ చింతమడక చిరుత పులులను కన్న గడ్డ. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ వస్తాం. కేసీఆర్‌కి మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. నేను అదే విషయాన్ని చెబితే నన్ను తప్పుపట్టారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వారిని నేను వదలను. ఈ గడ్డ ఎవరి జాగీరూ కాదు” అని కవిత వ్యాఖ్యానించారు. చివరిగా, “నా కుటుంబం నుంచి దూరం చేశారు అన్న బాధ ఉంది. కానీ దుఃఖంలో ఉన్న నన్ను మీరు గౌరవించారు. మీ ఆదరాభిమానాలకు రుణపడి ఉంటా” అంటూ కవిత తన భావాలను వ్యక్తం చేశారు.
