Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్

  • సచివాలయం వద్ద కవిత భారీ ఆందోళన
  • రోడ్డుపై ధాన్యం పోసి వినూత్న నిరసన
  • రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలన్న డిమాండ్
  • ఉద్రిక్తత మధ్య కవిత, కార్యకర్తల అరెస్ట్
Kavita Arrest

Kavita Arrest

Kavitha Arrest : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ సచివాలయం (సెక్రటేరియట్) ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారీ ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆమె సచివాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (ఐకేపీ సెంటర్లు) తీవ్ర జాప్యం జరుగుతోందని, రైతులు పండించిన పంటను తక్షణమే సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కవిత మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, తరుగు నెపంతో “కటింగ్స్” పేరుతో మిల్లర్లు, అధికారులు చేతులు కలిపి అన్నదాతలను నిలువునా ముంచుతున్నారని ఆమె ఆరోపించారు. రైతులకు మద్దతుగా నిలిచిన ఆమె.. తక్షణమే క్వింటాలు వరి ధాన్యానికి రూ. 500 చొప్పున బోనస్ చెల్లించాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వరితో పాటు జొన్నలు, పొద్దుతిరుగుడు వంటి ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) కల్పించి ఆదుకోవాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ నిరసన సందర్భంగా కల్వకుంట్ల కవిత సచివాలయం మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై వరి ధాన్యాన్ని పోసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో సచివాలయం వైపు వచ్చే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య నెట్టివేతలు, వాగ్వాదం జరిగి ఉద్రిక్తత మరింత పెరిగింది. చివరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కవితతో పాటు ఆమె అనుచరులను, పార్టీ కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని అరెస్ట్ అయ్యే సమయంలో కవిత స్పష్టం చేశారు.