NTV Telugu Site icon

Kishan Reddy: అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Kishanreddy

Kishanreddy

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్‌ను నేరుగా కలవడం, అభ్యర్థి నామినేషన్‌పై చర్చించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎన్నిక అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర స్థాయి సమన్వయ కర్తలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: చివరి నిమిషంలో పవన్‌ పర్యటన వాయిదా.. నెక్ట్స్ ఏంటి..?

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ది ప్రచార ఆర్భాటమే తప్ప.. ఏ వర్గానికి రాష్ట్రంలో మేలు చేయలేదని ధ్వజమెత్తారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత అంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు చాలా విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలని కోరారు. పేద, మధ్య తరగతికి మేలు చేసే కేంద్ర బ‌డ్జెట్‌ను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితుల్లో మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలని కార్యకర్తలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Delhi Exit Poll: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నమ్మొచ్చు.. 2015, 2020గణాంకాలు నిజాన్నే చెప్పాయా ?