NTV Telugu Site icon

BJP MLA Ramana Reddy: సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చేసిన బీజేపీ ఎమ్మెల్యే

Kamareddy Mla Ramana Reddy

Kamareddy Mla Ramana Reddy

BJP MLA Ramana Reddy: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కామారెడ్డి పట్టణంలో రోడ్డు వెడల్పు చేసేందుకు సొంత ఇంటిని కూల్చివేసుకున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో శనివారం ఉదయం ఇంటిని కూల్చివేశారు. అయితే ఇప్పుడు నగరవాసుల దృష్టి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పడింది. ఈ రోడ్డుపైనే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇల్లు ఉంది. దీనిపై షబ్బీర్ అలీ ఎలా స్పందిస్తారోనని కామారెడ్డి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న సొంత ఇంటిని కూల్చివేసి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట నిలబెట్టుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు కూల్చివేసేందుకు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల యజమానులు సహకరించాలని కోరారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు 80 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 30 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది.

Read also: Minister Seethakka: ములుగులో సీతక్క పర్యటన.. మేడారం జాతర పనుల పరిశీలన

వారంలో స్వచ్ఛందంగా తొలగించండి..

రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయిలు, షెడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల తొలగింపు తన ఇంటి నుంచే ప్రారంభించాలని, దారిలో ఉన్న తన ఇంటిని కూల్చివేసి అధికారులకు అప్పగించారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీతో దగ్గరుండి ఇంటిని కూల్చివేశారు. పంచముఖి హనుమాన్ దేవాలయం కూడా ఇదే దారిలో ఉన్నందున ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లోగా రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్లను స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో 24 అడుగుల రోడ్డును నెల రోజుల్లోగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన పనికి సార్ మీకు సలామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్‌ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..