Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయడానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా నిరాకరించింది. 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాలకు చట్టబద్ధమైన ఆధారం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు, కేవలం ప్రభుత్వ జీవోలతో ప్రజాధనాన్ని ఉచిత పథకాలకు వాడటం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కీలక రంగాలు నిధుల కొరత ఎదుర్కొంటుంటే, మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా సమయానికి అందక అనేకమంది తీవ్ర అవస్థలకు గురవుతున్నారని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని ఈ సందర్భంగా హెచ్చరించింది.
ప్రజాపన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ఉచిత పథకాలకు వెచ్చించే కంటే, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకువచ్చి ఆ రాబడితో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు కదా అని ధర్మాసనం సూచించింది. భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, బాధితులు ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనిపై తప్పుడు అఫిడవిట్ సమర్పించడంపైనా న్యాయస్థానం క్లాస్ తీసకుంది. ఈ పథకాల చట్టబద్ధత, బడ్జెట్ కేటాయింపులపై స్పష్టమైన వివరణ కావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

