kaleshwaram project-National status: తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును లక్ష కోట్లకు మించిన వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. అంతకు ముందు ఉన్న ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని రిడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. గోదావరి నదిపై పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజీలను నిర్మించి దానికి అనుబంధంగా పంప్ హౌజులతో గోదావరి నీటిని ఎత్తిపోయాలని ప్రాజెక్టును నిర్మించారు. ఇదిలా ఉంటే ఇంతటి భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం లేకపోతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని టీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
Read Also: Gram Panchayats Resolution: మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి.. 5 ఏపీ గ్రామాల తీర్మానం
ఇదిలా ఉంటే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ జాతీయ హోదా కల్పించాలని కోరారని.. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని ఆయన వెల్లడించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు స్కీంలో చేర్చడానికి అర్హత లేదని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన సమాధానంలో తెలంగాణ సర్కార్, టీఆర్ఎస్ నాయకులు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.