Site icon NTV Telugu

Telangana: నెరవేరుతున్న కేసీఆర్ సంకల్పం.. యాదాద్రికి చేరిన గోదావరి జలాలు

గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి.

యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సోమవారం ఓ రాగిబిందెలో పవిత్ర గోదావరి జలాలను యాదాద్రీశుడి చెంతకు తీసుకొచ్చారు. యాదగిరిగుట్టలోని స్థానిక గండిచెరువుకు చేరిన గోదావరి జలాలు అక్కడి నుంచి కొండ కింద ఉన్న లక్ష్మి పుష్కరిణికి, కొండపైనున్న విష్ణు పుష్కరిణిలకు తరలిస్తారు. ఇకపై నిత్యం గోదారి జలాలతో స్వామివారికి అభిషేకం చేయనున్నారు.

కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో బస్వాపూర్‌ వద్ద నరసింహస్వామి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. 11.39 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మాణమవుతుండగా.. తొలిదశలో 1.5 టీఎంసీల నీటిని మళ్లించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. రిజర్వాయర్‌లోకి నీరు తరలించడంతో పాటు కాల్వల పరిశీలనపై ఇప్పటికే అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దీంతో ఆలేరు ఎమ్మెల్యే ప్రారంభించిన ఓటీ 1 నుంచి గోదావరి జలాలను గండి చెరువులోకి వదిలారు. ఓటీ 2పై ట్రయల్‌ రన్‌ను అధికారులు పరిశీలించారు.

Exit mobile version