KA Paul Promises To Develop Munugode As America: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన.. ఒక చిన్న హోటల్‌లో దోసెలు వేస్తూ కనిపించారు. ఓవైపు దోసె వేస్తూనే, మరోవైపు అక్కడున్న ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తన పార్టీకి ఉంగరం గుర్తుని కేటాయించారని, తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానని అన్నారు.
కేఏ పాల్ మాట్లాడుతూ.. నిరుద్యోగులందరూ తన కేఏ పాల్ యాప్‌లో లాగిన్ అవ్వమని, అలాగే ఆ యాప్‌ని షేర్ చేయమని కోరారు. మునుగోడుని అమెరికా చేసి పారేద్దామని చెప్పారు. మునుగోడులో ఉన్న ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానని.. రెండు సంవత్సరాలలోపు నిరుద్యోగ సమస్యే లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే.. తాను ఏ హోటల్‌లో అయితే దోసెలు వేస్తున్నానో, ఆ దంపతుల ఇద్దరు పిల్లలకే కేజీ టు పీజీ వరకు చదివిస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు. వందలమంది పిల్లల్ని కూడా తాను చదివిస్తానని మాటిచ్చారు. మండలానికి ఒక్కోటి చొప్పున ఆసుపత్రి, కాలేజీలు నిర్మిస్తానని కూడా హామీ ఇచ్చిన ఆయన.. రైతుల సమస్యల్ని సైతం తీరుస్తానన్నారు.
ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఓటు వేయాలని కేఏ పాల్ కోరారు. తన పార్టీ గుర్తు ఉంగరమని, సీరియల్ నం. 17 అని చెప్పిన ఆయన.. ఈ కుల, కుటుంబ అవినీతి పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి, మన మునుగోడుని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇతర రాజకీయ నాయకుల దొంగ మాటలు నమ్మొద్దని కేఏ పాల్ కోరారు. కొసమెరుపు ఏమిటంటే.. కేఏ పాల్ మాటలకు కౌంటర్లు ఇస్తూ, జనం కూడా ఉత్సాహం చూపారు.