K Laxman Gets Place In BJP Parliamentary Board and Central Election Committee: 2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. బీజేపీ అప్పుడే రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ తరుణంలోనే కేంద్ర పార్లమెంటరీ బోర్డుని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులతో కూడిన ఈ బోర్డులో తెలంగాణ నుంచి కే. లక్ష్మణ్‌ను చోటు కల్పించారు. ఈ బోర్డుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. కే లక్ష్మణ్ సహా ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, యడ్యూరప్ప, శర్భానంద్ సోనావాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్యనారాయణ జటీయా, బిఎల్ సంతోష్ సభ్యులుగా ఉన్నారు. ఇదే సమయంలో నూతన కేంద్ర ఎన్నికల కమిటీని సైతం బీజేపీ నియమించింది. ఇందులోనూ కే. లక్ష్మణ్‌కు చోటు కల్పించడం విశేషం. మొత్తం 15 మంది సభ్యులున్న ఈ కమిటీకి జేపీ నడ్డా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, యడ్యూరప్ప, శర్భానంద్ సోనావాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్యనారాయణ జటీయా, బూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫండవిస్, హోం మాధుర్, వనతి శ్రీనివాస్, బిఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు.
రెండు కమిటీల్లోనూ కే. లక్ష్మణ్‌కు చోటు కల్పించడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి తెలంగాణలోనూ బీజేపీ జెండా పాతేందుకు సాయశక్తులా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే! ఆ వ్యూహాల్లో భాగంగానే కే. లక్ష్మణ్‌ను రెండు కమిటీల్లోనూ చోటు ఇవ్వడం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేందుకే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని వాళ్లు అంటున్నారు. అంతకుముందే యూపీ నుంచి లక్ష్మణ్‌కు రాజ్యసభ్య టికెట్ ఇచ్చి, జాతీయ రాజకీయాలకు క్రీయాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కల్పించారు. అలాగే, రాష్ట్రంలో తమ రాజకీయ వ్యూహాలకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఒక రాష్ట్రస్థాయి నేతను జాతీయ స్థాయికి తీసుకెళ్లి, తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టామని ప్రజల విశ్వాసం పెంచడానికి దోహదం చేశారు. బీజేపీని నమ్మినవాళ్లకి కాస్త ఆలస్యంగానైనా, మంచి పదవులు లభిస్తాయని రాజకీయ నాయకులకు నమ్మకం కల్పించింది. రాజకీయాల్లో షార్ట్ కట్స్ ఉండవు, కష్టమే మనకు పదవులు తెచ్చిపెడుతుందని లక్ష్మణ్ ప్రగాఢంగా విశ్వసించారు. ఆయన నమ్మకమే ఈరోజు ఈ కీలక పదవి రావడానికి కారణమైంది.