NTV Telugu Site icon

TRS: సీఎం పర్యటనకు డుమ్మా.. ముగ్గురు అసంతృప్త నేతలు భేటీ..!

టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరం‌గా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇది రాజకీయంగా చర్చకు దారి తీసింది.. పినపాకలో ఈ‌మధ్యే టీఆర్ఎస్ వర్గ పోరు బహిర్గతం కాగా.. కేసీఆర్‌ పర్యటనకు డుమ్మా కొట్టి మరీ.. వారితో జూపల్లి భేటీ అయ్యారు.

Read Also: UP Polls: అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

జూపల్లి కృష్ణారావు ముందుగా దమ్మపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు ముచ్చటించారు అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం మీదుగా వెళ్తుండగా ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు , తుళ్లూరు అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇది క్యాజువల్‌గా మాత్రమే జరిగిందని కలవడానికి మాత్రమే జూపల్లి వచ్చాడని జిల్లా నేతలు అంటున్నారు. దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలేదని చెబుతున్నారు. కానీ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుండగా.. జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా కొచ్చి టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీని వేర్వేరుగా కలవడం చర్చనీయాంశంగా మారింది.