షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి పండగకు ఊరెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటలకు రైలు షాద్‌నగర్‌లో ఆగిన సమయంలో ఆమె రైలు దిగింది. అది కాచిగూడ కాదని తెలుసుకుని రైలు ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదలడంతో జారి రైలు కింద పడిపోయింది.
Read Also: ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి
ఈ ఘటనలో జ్యోతి తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే రైల్వే పోలీసులు గుర్తించి ఆమెను వైద్యం నిమిత్తం హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అడ్డుకున్నారు. జ్యోతి మృతిపై తమకు అనుమానాలున్నాయని… పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మృతురాలి బంధువులు, స్నేహితులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాగా కడప జిల్లా చిట్వేల్ మండలానికి చెందిన బట్టినపాత జ్యోతి హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా చేస్తుంది. దాంతో పాటు సినిమాల్లోకి రావాలని జూనియర్ ఆర్టిస్టుగా చేస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
