Jubilee Hills Police Filed Case Against Suvarnabhumi MD And Many Others For Cheating: ప్రతీ మధ్యతరగతి కుటుంబానిది ఒకటే డ్రీమ్.. అదే సొంతింటి కల. కానీ.. హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఒక ప్లాట్ కొనాలంటే, లక్షలకు లక్షలు పెట్టాలి. అందుకే, తక్కువ ధరకు ప్లాట్లు ఏమైనా దొరుకుతాయా? అని జనాలు పడిగాపులు కాస్తుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసుకొని, కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకే ప్లాట్లు ఇస్తామని చెప్పి, లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. తాజాగా సువర్ణభూమి సంస్థ కూడా ఇలాంటి భారీ మోసానికే పాల్పడింది. ప్లాట్ల విక్రయం పేరుతో ఈ సంస్థ బురిడి కొట్టించింది. బోగస్ రసీదులతో మోసం చేసింది. షాద్‌నగర్‌లో తక్కువ ధరకు ప్లాట్లు అంటూ నమ్మించి.. కొంతమంది నుంచి లక్షలాది రూపాయలు ఆ సంస్థ వసూలు చేసింది. దీంతో.. సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు పలువురు ఉద్యోగులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
P Gowtham Reddy: చిన్న సినిమాల కోసమే ఏపీ ఫైబర్.. 39 రూపాయలకే!
శ్రీకృష్ణానగర్‌లో నివాసముంటున్న కొండల్‌రావుతో పాటు 21మంది సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరికి 2017లో జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లో ఉన్న సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన గంగిరెడ్డి దస్తగిరిరెడ్డి పరిచయం అయ్యాడు. షాద్‌నగర్ సమీపంలో తమ సంస్థ ‘సువర్ణ కుటీర్’ పేరుతో సరికొత్త వెంచర్ వేస్తోందని, ఈ వెంచర్‌లో తక్కువ ధరలకే ప్లాట్లు ఇస్తోందని నమ్మించాడు. తక్కువ ధరలకే ప్లాట్లు వస్తాయన్న ఆశతో.. గంగిరెడ్డి మాటల్ని వాళ్లు నమ్మారు. ఇంకేముంది.. తాము వేసిన గాలంలో చేపలు చిక్కాయని భావించి, వారిని ఆఫీసుకు తీసుకువెళ్లాడు. అక్కడ వారిని ఆ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్‌కు పరిచయం చేశాడు. రూ.1,900లకు గజం చొప్పున ప్లాట్లు విక్రయిస్తామని, మూడేండ్లలో డబ్బులు చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని ఆ సంస్థ ఎండీతో పాటు ఇతర ప్రతినిధులు నమ్మబలికారు. దీంతో.. బాధితులంతా తాము తీసుకున్న ప్లాట్లకు సంబంధించిన మొత్తం డబ్బు చెల్లించారు.
MVV Satyanarayana: మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేధించారు.. నా ఫ్యామిలీ క్షేమం
ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.6లక్షల నుంచి రూ.50లక్షల వరకు చొప్పున.. సుమారు రెండున్నర కోట్లకు పైగా ఆ సంస్థ వసూలు చేసింది. ఇందుకు సంబంధించి.. సంస్థ తరఫు నుంచి దస్తగిరి వారికి రసీదులు ఇచ్చాడు. అయితే, డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం అవ్వలేదు. దీంతో.. ఈనెల 6న బాధితులు కలిసి, నేరుగా కార్యాలయానికి వెళ్లారు. రసీదులు చూపించి, వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆ రసీదుల్లో కొన్ని మాత్రమే తమ సంస్థకు చెందినవని, మిగిలిన రసీదులతో తమకు సంబంధం లేదని ఆ సంస్థ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఎండీ బొల్లినేని శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్, గంగిరెడ్డి దస్తగిరిరెడ్డితో పాటు పలువురిపై ఐపీసీ 420, 406, 467,471 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.