జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసిన ఆయన, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు.
“ముఖ్యమంత్రి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి, అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా,” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ఇకపై ఎలాంటి రాజకీయ వైషమ్యాలకు తావు ఇవ్వబోమని నవీన్ యాదవ్ వెల్లడించారు. గతంలో బీఆర్‌ఎస్ నాయకులు గెలిచినప్పుడు కొన్ని కక్షపూరిత రాజకీయాలు చేసి ఉండవచ్చని పరోక్షంగా పేర్కొంటూ.. “నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. ఈరోజు వరకే మీరు-మేము. ఇప్పటి నుండి మనం అంతా ఒకటే,” అని స్థానిక ప్రజలు, నాయకులకు భరోసా ఇచ్చారు.
