జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఓటర్లు మొదటి రెండు గంటలు.. అంటే ఉదయం 9 గంటల వరకు.. మాత్రమే కొంత ఉత్సాహంగా వచ్చి 10% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం క్రమంగా నెమ్మదించింది. సాయంత్రం 3 గంటల సమయానికి కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది.
పోలింగ్ శాతం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది ఉప ఎన్నిక కావడంతో ఓటర్లలో నిరాసక్తి ఎక్కువగా ఉంది. అలాగే, ఈ నియోజకవర్గంలో నివసించే సినీ తారలు, ప్రముఖులు గత సాధారణ ఎన్నికల మాదిరిగా పెద్దగా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. చాలా మంది ప్రముఖులు నగరంలో అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు, ఇక్కడి ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించకపోవడం వల్ల, వారు ఓటింగ్‌కు దూరమయ్యారు.
ముఖ్యంగా, సంపన్నులు నివసించే జూబ్లీ హిల్స్ మెయిన్ ఏరియాతో పాటు షేక్‌పేట్, రెహమత్‌నగర్, బోరబండ వంటి ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్దగా రావడం లేదు. గత 2023 ఎన్నికలలో నమోదైన 43% ఓటింగ్‌ను కూడా ఈసారి చేరుకోవడం కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ, చివరి రెండు గంటల్లోనైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి, కనీసం 50% వరకు ఓటింగ్ పెంచడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Raja Singh : ఢిల్లీ పేలుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్
