NTV Telugu Site icon

Bhupalpally: ఆస్పత్రికి వెళ్లొచ్చే సరికి ఇళ్లు మొత్తం దోచేశారు..

Jayakshankar Bhupalapalli

Jayakshankar Bhupalapalli

Bhupalpally: కూతురి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళితే.. ఇంట్లో సొత్తంతా దోచుకుని పరారయ్యారు దొంగలు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి తాళం పగులగొట్టి సుమారు 18 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, టీవీని అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read also: Weather Update: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..

శంకరాంపల్లి గ్రామానికి చెందిన అనుమాల సత్యమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. సత్యమ్మకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు కార్తిక్ హైదరాబాద్‌లో ఉంటుండగా, కూతురి ప్రసవం కోసం నాలుగు రోజుల క్రితం సత్యమ్మ తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. గురువారం ఉదయం సత్యమ్మ ఇంటికి తలుపులు తెరిచి ఉండడం చూసిన స్థానికులు అనుమానంతో కార్తిక్, సత్యమ్మకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గడ్డపారతో బీరువాలు పగలగొట్టి ఇంట్లోని సామాగ్రి, దుస్తులను చిందరవందరగా పడివున్నాయి. బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

దీంతో ఇంటి యజమానులు లబోదిబోమన్నారు. వెంటనే కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జునరావు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని చేరుకొని క్షుణ్నంగా పరిశీలించి ఆనవాళ్లను సేకరించారు. కాటారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడో చోట తరుచు దొంగతనాలు జరుగుతున్న నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kazipet Railway Coach: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

Show comments