ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.
పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి తుమ్మల వర్గం మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో తుమ్మల పర్యటనల జోరు పెరగడంతో తుమ్మల వర్గంపై కేసులను పెట్టిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో మూడు కేసులను తుమ్మల వర్గం మీద పెట్టారు. ఈ నెల పదిహేడున తుమ్మల వర్గానికి చెందిన మాజీ కార్పోరేటర్ జంగం భాస్కర్ ను ఖమ్మం రూరల్ పోలీసులు పిలిపించారు. అయితే మాజీ కార్పోరేటర్ భాస్కర్ అదే రోజు మధ్యాహ్నం ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అయితే మాజీ కార్పోరేటర్ జంగం భాస్కర్ కు హాని చేస్తారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ లో అదే రోజు రాత్రి ధర్నా చేశారు తుమ్మల వర్గీయులు.
ఈ సందర్బంగా ఆందోళన చేస్తున్న తుమ్మల వర్గీయుల మీద పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించారు. భాస్కర్ భార్య మీద పడ్డారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేసిన తుమ్మల వర్గీయుల మీద పోలీసులు కేసు పెట్టారు. వారిని నిన్న అరెస్టు చేసిన తరువాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికి జంగం భాస్కర్ ఎక్కడ ఉన్నాడో మాత్రం స్పష్టం కావడం లేదు. గత ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు పిలిపించారు. జంగం భాస్కర్ కనిపించకుండా పోయాడని తెలుస్తోంది. జంగం భాస్కర్ ఎటు పోయాడు అన్నదానిపై పోలీసులు కూడా వివరణ ఇవ్వడం లేదు. కాగా జంగం భాస్కర్ మీద ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి, ఎంఎల్ఎ అనుచరుడు బెల్లం వేణులు కేసులు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన అంటుంది. తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అదే విధంగా ఏసీపీ బస్వి రెడ్డి, ఖమ్మం రూరల్ పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ, సీఐలపై పోలీసు ఉన్నతాధికారులకు, హెచ్చార్సీకి ఫిర్యాదు చేసింది.
పాలేరులోని అధికార పార్టీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తుమ్మలనాగేశ్వర రావు మీద కందాల అనుచరుడు బాహాటంగానే విరుచుకుపడ్డారు. ఇకపోతే తుమ్మల వర్గీయుల మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు. తాజాగా కార్పోరేటర్ జంగం భాస్కర్ ఆచూకీని తెలియనివ్వడం లేదని భాస్కర్ భార్య ఆరోపిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు మాత్రం స్పందించడం లేదు. వివరణ ఇవ్వడం లేదు. పోలీసు అధికారులపై తీవ్ర స్థాయిలో జంగం భాస్కర్ భార్య ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.